పల్లె ప్రగతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Tuesday February 09, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపాలన ) : పల్లె ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట్‌ మండలానికి చెందిన పాత కోలుకుంద, కొత్తకోలుకుంద గ్రామాలలో ఉదయం 6.30 గంటలకు " మీతో నేను " కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గ్రామాలలోని అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పాత కోల్కుంద గ్రామంలో వాటర్ ట్యాంకు పైప్ లీకేజీ కారణంగా నీరు వృధా అవుతుందని చెప్పారు. సంబంధిత మిషన్ భగీరథ అధికారులు మరమ్మత్తులు చేసి నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు. కొత్త కోల్కుంద సెక్రటరీ పని తీరు సరిగ్గా లేకపోవటంతో గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు పడకేయడంతోఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి జరగకపోగా ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సెక్రటరీ మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో పల్లె ప్రగతి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రెండు గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించకపోవటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి అద్వానంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గమనించిన ఎమ్మెల్యే వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పాత కోల్కుంద గ్రామంలో వర్షానికి ఇల్లు కూలిపోవటంతో బాధపడుతున్న మహిళకు ప్రభుత్వం తరపున సంబంధిత సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. రోడ్డు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సర్వేయర్ తో సర్వే చేయించి రోడ్ల సమస్యలు  పరిష్కరించాలని ఎంఆర్ఒ, ఏడిలకు సూచించారు. పాత కోల్కుంద గ్రామస్థులు కొంతమంది కలిసి 2 ఎకరాల భూమిని కొని గడ్డి కల్లాలకు ఉపయోగించి ఇప్పుడు నివాసయోగ్యంగా ఉండటంతో వాటిని ప్లాట్స్ గా చేసుకోవాలనుకుంటున్న తరుణంలో గ్రామ సెక్రెటరీ అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్లు అంజి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు విఠల్, మోమిన్‌పేట్‌ మండల పార్టీ అధ్యక్షుడు నాసన్ పల్లి నర్సింహా రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ లక్ష్మయ్య, డైరెక్టర్లు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ లు, వార్డు మెంబర్లు, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, తదితర నాయకులు పాల్గొన్నారు.