ప్రభుత్వ నిర్లక్ష్యమే గోరయ్య ప్రాణం తీసింది

Published: Monday September 06, 2021
ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజాపాలన : వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే వాగులను గుర్తించి వంతెనల నిర్మాణం చేపట్టాలని ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ధారూర్ మండల పరిధిలోని దోర్నాల్ వాగుకు వంతెన నిర్మాణాన్ని సాగదీయడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. దోర్నాల్ గ్రామానికి చెందిన గోరయ్య వాగు దాటే క్రమమంలో ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకొనిపోయి మృతి చెందాడని పేర్కొన్నారు. వాగులపై వంతెనల నిర్మాణం పై ప్రభుత్వ ఉదాసీనత వైఖరి కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాత్కాలిక వంతెన లపై ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలను కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు చోద్యం చూస్తుండడంతో శనివారం సాయంత్రం దోర్నాల్ వాగులో గోరయ్య కొట్టుకొనిపోయి మృతి చెందాడని ఉద్ఘాటించారు. దోర్నాల్ గ్రామానికి చెందిన గోరయ్య మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారని వివరించారు. గోరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.