ఆ ముగ్గురితో సర్వసభ్య సమావేశం రసాభాస

Published: Tuesday September 27, 2022
* రచ్చకెక్కిన టిఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య
* గత ఐదు నెలలుగా ఓ కొలిక్కి రాని మున్సిపల్ చైర్మన్ పదవి 
* ముగ్గురు కౌన్సిలర్ల కారణంగా సర్వసభ్య సమావేశం రసాభాస
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజా పాలన : వికారాబాద్ మున్సిపల్ రాష్ట్రస్థాయిలో అభివృద్ధి పరంగా మంచి గుర్తింపు లభించింది. గత రెండున్నర సంవత్సరాల కాల పరిమితిలో మున్సిపల్ చైర్ పర్సన్ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల అంతర్గత రహస్య ఒప్పందం రచ్చ కెక్కి నవ్వుల పాలవుతుంది. చైర్మన్ పదవిని మొదటి రెండున్నర సంవత్సరాల కాలంలో చిగుళ్లపల్లి మంజుల రమేష్, తరువాత రెండున్నర సంవత్సరాల కాల పరిమితిని లంక పుష్పలత లక్ష్మీకాంత్ రెడ్డి చేపట్టాలని అంతర్గత రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దైవసాక్షిగా ఒప్పందం చేసుకున్నట్లు పలు సమావేశాల్లో కౌన్సిలర్లు బహిర్గతపరుస్తున్నారు.. అవకాశం దొరికిన ప్రతి సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ పదవి కోసమే పట్టుబడుతున్న ఆ ముగ్గురు టిఆర్ఎస్ కౌన్సిలర్లు చిట్యాల అనంతరెడ్డి హీరేకార్ సురేష లంక పుష్పలత లక్ష్మీకాంత్ రెడ్డి. సోమవారం బతుకమ్మ దసరా పండుగల అత్యవసరరీత్యా వివిధ పనులను చేపట్టుటకు అంచనా వ్యయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఎజెండాను సభ ముందు ఉంచారు. ఆ ముగ్గురు కౌన్సిలర్ల కారణంగా ఎజెండాను పక్కకు పడేసి చైర్మన్ పదవి కోసం పట్టుపట్టారు. చైర్మన్ కుర్చీ సమస్య పరిష్కారం అయ్యేవరకు సమావేశాలకు అంతరాయం కలిగిస్తామని చెబుతున్నారు. పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేసి స్వీయ లాభం కోసం పోరాడుతున్న ఆ ముగ్గురు కౌన్సిలర్లు. ప్రతిపక్షవార్డుల కౌన్సిలర్లు మా వార్డులలోని సమస్యలను సభ దృష్టికి తేనివ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ దేవి రెడ్యానాయక్ మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి పల్లకిని 10వ వార్డులోని పురాతన లక్ష్మీనారాయణ దేవాలయానికి రావాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. స్పందించిన చైర్పర్సన్ శ్రీ అనంతపద్మనాభ స్వామి పల్లకిని కోరిన వార్డుల్లోకి తప్పనిసరిగా వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతి అభివృద్ధి పనులు టిఆర్ఎస్ పార్టీ కౌన్సిర్ల అంతర్గత సమస్యల కారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి విమర్శించారు. పలు వార్డులలో అండర్ గ్రౌండ్, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని తీవ్ర స్వరంతో సుధాకర్ రెడ్డి విమర్శించారు. కౌన్సిలర్ హీరేకార్ సురేష్ మా వార్డులోని సమస్యల పరిష్కారానికి సహకరించడం లేదని ఘాటుగా మాట్లాడారు. సర్వసభ్ర సమావేశానికి ఫోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అవసరమా అని ప్రశ్నించారు.
మునుపెన్నడు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవని అన్నారు. చైర్ పర్సన్ పూర్వ ఒప్పందం ప్రకారం పదవిలో కొనసాగుతానని ఒప్పందం చేసుకోలేదని సభాముఖంగా చెప్పండని కౌన్సిలర్ అనంత్ రెడ్డి నిలదీశారు. చైర్ పర్సన్ ను వ్యతిరేకించే కౌన్సిలర్ల వార్డులలో అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ ముగ్గురు కౌన్సిలర్లు మండిపడ్డారు. 34 వార్డులలోని సమస్యల గురించి చైర్ పర్సన్ పట్టించుకోవడం లేదని పుష్పలతా రెడ్డి, అనంత్ రెడ్డి, సురేష్ ఆరోపించారు. ఏ అధికారంతో చైర్ పర్సన్ సీట్లో కూర్చున్నారో సమాధానం చెప్పాలని పుష్పలతా రెడ్డి సభాముఖంగా ఘాటుగా ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశానికి సంబంధించిన విషయాలను స్వంతంగా వీడియో ఎందుకు తీయిస్తున్నారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ పరంగా పూర్వ ఒప్పందాన్ని అతిక్రమించిన దృష్ట్యా సభను నడవనివ్వమని కౌన్సిలర్ అనంత్ రెడ్డి హెచ్చరించారు. వెంటనే మున్సిపల్ చైర్ పర్సన్ స్పందించి కౌన్సిలర్ అనంతరెడ్డిని సభ నుండి సస్పెండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రతికూల కౌన్సిలర్లు అనంతరెడ్డిని అనుసరించి సర్వసభ్య సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల అంతర్గత గొడవల కారణంగా ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల వార్డుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదని కాంగ్రెస్ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి బిజెపి కౌన్సిలర్ తొడిగల శ్రీదేవి సదానంద రెడ్డి విమర్శించారు.