ఆర్ టిపిసిఆర్ కు మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Tuesday May 04, 2021
వికారాబాద్ మే 03 ప్రజాపాలన బ్యూరో : ఆర్ టిపిసిఆర్ (రివర్స్ ట్రాన్ స్క్రిప్షన్ పాలిమర్ చైన్ రియాక్షన్)ను వినియోగంలోకి తెచ్చేందుకు త్వరగా మౌళిక వసతుల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆర్ టిపిసిఆర్ ల్యాబ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ శాంపిల్ కలెక్షన్ తో పాటు టెస్టింగులు కూడా చేసుకొనే విధంగా రివర్స్ ట్రాన్ స్క్రిప్షన్ పాలిమర్ చైన్ రియాక్షన్ కేంద్రం మంజూరు అయినందున పనులను వేగవంతం చేసి ఈ నెల 7 వరకు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.  ఈ సందర్బంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ఐసొలేషన్ గదులను, ఐసియు ( ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ) సెంటర్ ను పరిశీలించారు. ఐసియు లో (58) పడకలకు ఆక్సిజన్ సదుపాయాలు కల్పించుటకు ఏర్పాట్లను పరిశీలించారు. స్త్రీ, పురుషులకు వేరు వేరుగా ఐసొలేషన్ గదులు, నీటి, విద్యుత్ తదితర సదుపాయాలను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.అనంతరం అనంతగిరిలోని టీబీ ఆసుపత్రిలో (40) పడకల ఐసొలేషన్ వార్డును పరిశీలించారు. అన్ని పడకలకు ఆక్సిజన్ ఏర్పాట్లు చేయాలన్నారు. 20 బెడ్స్ పురుషులకు, 20 బెడ్స్ మహిళల కొసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేసినారు. ఇందులో ఇంటర్నెట్ సదుపాయంతో పాటు డాక్టర్లు, నర్సులు, హౌస్ కీపింగ్ సిబ్బంది అందరు మూడు షిఫ్ట్ లలో పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుధాకర్ షిండే, డాక్టర్ ర్ రమ్యశ్రీ, డాక్టర్ లలిత, డాక్టర్ యాదయ్య డాక్టర్ శాంతప్ప డాక్టర్ ప్రదీప్ డాక్టర్ వినోద్ టిఎస్ఎఎఎస్ఐడిసి డిఈ రవీందర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.