ధరణి పోర్టల్ ఆపరేటర్స్ పై చర్యలు తీసుకోవాలి ** యువజన సంఘాలు కలెక్టరేట్ లో వినతి **

Published: Saturday December 31, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 30 (ప్రజాపాలన,ప్రతినిధి) : అక్రమాలకు పాల్పడుతున్న ధరణి పోర్టల్ ఆపరేటర్స్ పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ లో ఏ,ఓ,కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ను ధరణి పోర్టల్ ద్వారా తహసిల్దార్ కార్యాలయము నుండి చేసుకొనుటకు అవకాశం కల్పించగా రిజిస్ట్రేషన్ కోసం వెళుతున్న రైతుల వద్ద నుండి  కారణాలను చూపెడుతూ, వారి వద్ద నుండి అక్రమంగా  అధిక డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున తక్షణమే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న  వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, దానికి పూర్తి బాధ్యత అధికారులే నిర్వహించాలని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ రావు, మాల శ్రీ, నితిన్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.