ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

Published: Wednesday March 09, 2022
బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ నిరసన.
మంచిర్యాల టౌన్, మార్చి08, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యం అవుతుందని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ముందు తెలంగాణ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ సోమవారం రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో గత సంవత్సరం కంటే విద్యారంగానికి నిధులు తగ్గాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి విద్యారంగానికి కేటాయించే కేటాయింపులు చూస్తే విద్యారంగం పట్ల టిఆర్ఎస్ చిత్తశుద్ధి ఏమిటో అర్ధం అవుతుందని విమర్శించించారు. అందరికీ నాణ్యమైన విద్య అందించటానికి, కేజీ నుంచి పిజి తరగతులకు, ఇంగ్లీష్ మీడియం, వివిధ యాజమాన్యాల కింద ఉన్న హైస్కూళ్లలో తరగతులు, ఇంటర్, డిగ్రీ మరియు వృత్తి విద్య కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పన తదితర అవసరాలకు బడ్జెట్లో తక్కువ నిధులను కేటాయించడం వలన ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత పతనమయ్యే ప్రమాదం దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ సవరించి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బబ్లు, నవీన, ప్రియాంక, సుప్రియ, పల్లవి, సాయి కీర్తన, మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.