దివ్యాంగులకు కేటాయించిన భూమిని లాక్కోవద్దు

Published: Thursday December 15, 2022
* ఎన్కతల సమాఖ్య దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వడ్ల మురహరి
వికారాబాద్ బ్యూరో 14 డిసెంబర్ ప్రజా పాలన : దివ్యాంగులకు కేటాయించిన భూమిని లాక్కో వద్దని ఎన్కతల గ్రామ సమాఖ్య దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వడ్ల మురహరి డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ముందు మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామానికి  చెందిన ఎన్కతల గ్రామ దివ్యాంగుల సమాఖ్య సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్కతల గ్రామానికి చెందిన 120 మంది దివ్యాంగులకు సర్వే నంబర్ 174 లో 20 ఎకరాల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు కేటాయించినప్పటి నుండి ఇప్పటివరకు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొనుటకు భూమి నుండి రాళ్లు రప్పలు తీయించామని వివరించారు. మాకు కేటాయించిన భూమి చుట్టూ కాలువలు తీయించామని చెప్పారు. పొలము గట్లపై టేకు చెట్లను కూడా పెంచామని అన్నారు. వర్షపు నీటి నిల్వ కొరకు ఫారం పండు గుంతలు మంచినీటి సౌకర్యం కోసం రెండు బోర్లను వేయించామని తెలిపారు. కరెంటు సౌకర్యము లేకపోవడంతో బోరు మోటర్లు మంజూరు కాలేదని స్పష్టం చేశారు. ఏ జీవనాధారం లేని మా బతుకులను బాగుపరచుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రస్తుత ప్రభుత్వము లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వము లాక్కుంటే మాకు చావే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. రేయింబవళ్లు కష్టపడి రాళ్లు రప్పలు తొలగించి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్న భూమిని లాక్కునే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు మొండికేసి బలవంతంగా మా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే మా కుటుంబ సభ్యులందరము ఆత్మహత్య చేసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎన్కతల గ్రామ దివ్యాంగుల సమాఖ్య సంఘం ప్రధాన కార్యదర్శి తలారి కిష్టయ్య సంఘం సహాయ కార్యదర్శి ఆలంపల్లి బందయ్య కోశాధికారి మన్నె చంద్రయ్య జాయింట్ సెక్రెటరీ మునగాల సంగయ్య తదితర సంఘం సభ్యులు పాల్గొన్నారు.