సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు

Published: Monday August 01, 2022

సీపీఐ జిల్లా 22వ మహాసభలను జయప్రదం చేయండి 

బోనకల్, జులై 31 ప్రజా పాలన ప్రతినిధి: సి పి ఐ ఖమ్మం జిల్లా 22వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు. మండలంలోని ముష్టికుంట్ల గ్రామం లో మండల సీపీఐ కార్యవర్గ సమావేశం ఆకెన పవన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి దారి సమాజంలో సామాన్యుల, శ్రమజీవుల, మధ్యతరగతి ప్రజల, కార్మికులతోపాటు అన్నివర్గాల ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
కార్పోరేట్ దిగ్గజాల ఆస్తులు పెరుగుతున్నాయని,
75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో ఇంకా 28 కోట్ల మంది అతిపేదరికం, 50 కోట్లమంది పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నారు. మరో వైపు అంబానీ, అదానీలతోపాటు మరి కొంతమంది నాయకుల ఆదాయాలు మాత్రం పెరుగుతున్నాయని, కరోనాతో ప్రజల ఆదాయాలు తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే కొద్దిమంది కుబేరులు మాత్రం ఆదాయాలను ఎలా ఆర్జిస్తున్నారో తెలిపాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల జీవన ప్రమాణాలు
మెరుగుపడటం లేదని విచారం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద ప్రజల బతుకులు చితికిపోయాయన్నారు. ఉపాధి అవకాశాలు సృష్టించి లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని, తెగనమ్మి అంబానీ, అదానీలకు చౌక ధరకు అప్పగిస్తున్నారని, జాతీయ బ్యాంకులను లూఠీ చేస్తున్నారన్నారు. రక్తతర్పణతో సాధించు కున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ, మతం పేరుతో ప్రజల మధ్య విభజన తెచ్చి మైనార్టీలపై దాడులు చేస్తూ రాజ్యాంగ మూల సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదకర దోరణులను బీజేపీ ప్రభుత్వం పెంచుతుందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, మాటలు బారెడు చేతలు మూరెడు లాగా కెసీఆర్ ప్రభుత్వం తయారైందన్నారు. ఈ పరిస్థితులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి, ప్రజల హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. ఈ పూర్వరంగంలో సుదీర్ఘపోరాటాలు, త్యాగాల చరిత్ర కలిగిన, దేశ స్వాతంత్య్ర్య పోరాటంలో నిజాం విముక్తి పోరాటంలో ప్రధానపాత్ర వహించి, ప్రజల నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిష్టు పార్టీ సీ.పి.ఐ జిల్లా 22వ మహాసభలు వైరాలో జరుగుతున్నాయన్నారు. ఈ జిల్లా మహాసభలకు పెద్ద ఎత్తున ప్రజల హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, జాగర్లమూడి రంజిత్ కుమార్, సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, ఏలూరి పూర్ణచందు, గూడిద కృష్ణ, వంగల హన్మంతరావు, మరీదు ఈశ్వరమ్మ, తోటపల్లి సునీత తదితరులు పాల్గొన్నారు.