ప్రజల మందనాలు పొందే విధంగా అధికారులు పనులు చేయాలి

Published: Tuesday February 28, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 27 ఫిబ్రవరి ప్రజాపాలన : మనసుపెట్టి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తాసిల్దార్లకు సూచించారు. సోమవారం ఆర్ డి ఓ లు, తాసిల్దార్లతో ధరణి సమస్యల పరిష్కారంపై నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ప్రతిరోజు మండలాల వారిగా  ధరణి సమస్యలను పరిష్కరించేందుకు తాసిల్దారులు తీసుకొచ్చే ఫైల్స్ అన్నింటిని  సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూర్చుని పరిష్కరించడం జరుగుతుందన్నారు.  ప్రజావాణిలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ధరణి సమస్యల పరిష్కారం కోసం రావడం వల్ల మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలియజేశారు.  జిల్లాలోని వికారాబాద్, మోమిన్ పేట, పూడూర్ మండలాలనుండి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయని, ఇట్టి సమస్యలను తాసిల్దారులు అక్కడికక్కడే పరిష్కరించినట్లయితే ప్రజలకు ఇబ్బందులు కలగవని తెలిపారు. కబ్జాలో ఉండి టైటిల్ సరిగా ఉన్నట్లయితే తప్పకుండా పరిష్కారం లభిస్తుందని ప్రజలకు తెలియజేయాలని, అలాగే ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, వివాదాలు, సాదాబైనామ, ఇనాం భూములు లాంటి సమస్యలు గల భూముల పరిష్కారం కాదని ఖరాఖండిగా ప్రజలకు తెలియపరచాలన్నారు. సక్సేషన్ లు, మ్యుటేషన్ లు సరిగా ఉంటే వెంటనే పనులు చేసి పెట్టాలన్నారు.  తహసీల్దారులు తప్పుడు పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.  మీసేవ ఆపరేటర్లు బోగస్ దరఖాస్తులు ధరణిలో అప్లోడ్ చేయకుండా తాసిల్దార్లు పరిశీలించాలని, మీ సేవలో తప్పులు జరగకుండా ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఇలాంటి తప్పులకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలియపరచాలన్నారు. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత తహసీల్దార్లదే అన్నారు. ఇలాంటి కేసులలో పూర్తి విచారణ అనంతరం ముందుకు వెళ్లాలని, సమస్యలన్నీ మండల స్థాయిలోనే పరిష్కారం జరగాలని కొత్త సమస్యలు సృష్టించరాదని, అయ్యే పని తప్పక అవుతుందని కాని పని స్పష్టంగా కాదని  సంకేతాలు ప్రజలకు పంపాలన్నారు. మండలాల వారిగా సీనియారిటీ ప్రకారంగా ధరణి దరఖాస్తులను స్కూటీని చేసుకుని వస్తే ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్, డి ఆర్ ఓ లతో కలిసి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్ పనులను పూర్తి చేయాలన్నారు.  ఒక్కొక్క రూట్ లో నాలుగు లేదా ఐదు బూతులు ఉండేలా చూసుకోవాలని, అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.  మార్చి 13న ఎన్నికలు పూర్తికాగానే నేరుగా వాహనాలను సరూర్ నగర్ లోని  రిసెప్షన్ సెంటర్ కు తరలించాలని సూచించారు.