పంచాయతీ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి

Published: Monday January 24, 2022
ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 23 (ప్రజాపాలన, ప్రతినిధి): గ్రామపంచాయతీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్(ఏఐటి యుసి)జిల్లా అధ్యక్షుడు భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్ అధ్యక్షతనలో పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా (జిపిడబ్ల్యుయు) జిల్లా  అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 45 వేల మంది కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పంచాయతీ అభివృద్ధి చేయడంలో ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలోను కీలక పాత్ర పోషిస్తున్నారని, కానీ ప్రస్తుతం వారిని శ్రమదోపిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవో నెంబర్ 60 ప్రకారం పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరమైన కార్మికులను నియమించారని, జీవో నెంబర్ 51రద్దు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించాలని, పని చేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 5న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యల పరిష్కారం కోసం నేడు 24న జేఏసీ ఆధ్వర్యంలో సర్పంచ్ లందరికీ, 27వ తేదీన ఎంపిపి, జెడ్పిటిసి, ఎంపీటీసీ లకు వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రెబ్బెన మండల కార్యదర్శి వెంకటేష్, శంకర్, నాయకులు వసంత్, సంతోష్, అంజయ్య, రవీందర్, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.