రైతులకు క్షేత్ర ప్రదర్శన పై అవగాహన కార్యక్రమం వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి

Published: Saturday February 11, 2023
బోనకల్ ,ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో భాస్వరం ఎరువును(పి ఎస్ బి) కరిగించే జీవన ఎరువుల పంపిణీ, వాడకం పొందే ప్రయోజనాలను గూర్చి వ్యవసాయ విస్తరణ అధికారి నాగినేని నాగసాయి రైతులకు క్షేత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ భూసార పరీక్షల ఫలితాల ప్రకారం భాస్వరం నిల్వలు ఎక్కువగా వున్నా అవి భూమికి అందుబాటులో లేకపోవడం వలన భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు వాడటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చునని వివరించారు.పంట ఎదుగుదలలో భాస్వరం వంటి స్థూల పోషకం కీలక మైనదనీ, భాస్వర పోషకం వేర్ల అభివృద్ది కి వివిధ జీవ క్రియలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందనీ,అదేవిధంగా ఎంజైమ్ లను,సేంద్రియ ఆమ్లాలను ఉత్పత్తి చేసి పంట ఎదుగుదలకు దోహదం చేస్తుంది అని పేర్కొన్నారు. ఎకరాకు 2 కేజీల పి యస్ బి ఎరువును 200 కేజీల పశువుల ఎరువుతో కానీ లేక వానపాముల ఎరువు తో కలిపి ఆఖరి దుక్కిలో లేదా ఆఖరి దమ్ము లో సమానంగా వేదజల్లవలెననీ, అంతే కాకుండా 100 మిల్లి లీటర్ నీటిలో,10 గ్రాముల బెల్లం కలిపి 200 గ్రాముల పి యస్ బి జీవన ఎరువు ఎకరాకు సరిపడా విత్తనం కు విత్తనశుద్ధి చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు అని రైతులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు చిట్టిమోదు నాగేశ్వరరావు, ఉమ్మినేని భాస్కరరావు, వంగల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.