ప్రశాంత వాతావరణంలో పరిక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

Published: Friday March 10, 2023
మంచిర్యాల బ్యూరో, మార్చి 9, ప్రజాపాలన.
 
ఏప్రిల్ 4 నుండి 13వ తేదీ వరకు జిల్లాలో జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 4 నుండి 13వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గం||లకు జిల్లాలో జరుగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కొరకు 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలోని 122 తెలుగు మాధ్యమం 162 ఆంగ్ల మాధ్యమం, 6 ఉర్దూ మాధ్యమం పాఠశాలల నుండి 5 వేల 245 మంది బాలురు, 4 వేల 869 మంది బాలికలు, 65 మంది ఇతరులు మొత్తంగా 10 వేల 114 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పరీక్షలు ప్రారంభమై ముగిసేంత వరకు వైర్లెస్ సెట్తో ఒక ఆపరేటర్ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆర్మ్స్ గార్డ్స్ భద్రత ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన 5 రూట్లలో ప్రశ్నాపత్రాల పంపిణీ, జవాబు పత్రాలు భద్రతపర్చు సమయంలో రెవెన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందం నందు ఒక ఎస్.ఐ., ఒక కానిస్టేబుల్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా స్థాయి అధికారులు, తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పరీక్షలు సజావుగా సాగే విధంగా తమ సమీపంలోని పరీక్ష కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.