సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Published: Wednesday September 21, 2022
న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
మణుగూరు లో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేసిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ  నేతలు
గత 12 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం మణుగూరు కూనవరం రైల్వే గేట్ సమీపంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె శిబిరాన్ని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు , భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి,  ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గౌని నాగేశ్వరరావు ,కందగట్ల సురేందర్, పి ఓ డబ్ల్యు నాయకురాలు మూతి మహాలక్ష్మి, ఇతర నాయకుల తో కలిసి సందర్శించి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆవునూరి మధు మాట్లాడుతూ ... సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతన పెంపు ప్రభుత్వ జీవో 22 ప్రకారం అన్ స్కిల్ కార్మికులకు రోజుకు కనీస వేతనం 750 రూపాయలు ఇవ్వాలని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని , సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, తదితర డిమాండ్లతో గత 12 రోజులుగా సింగరేణి కాంట్రాక్టు  కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ , కెసిఆర్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తున్నాయని, 
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తమ బతుకులు బాగుపడతాయని భావించిన అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. సమస్యలు చెప్పుకుందామంటే నిర్బంధాలు , అణచివేత, లాటిచార్జీలు , కేసులు, అరెస్టులతో నిరంకుశ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా  రాష్ట్ర ప్రభుత్వం , సింగరేణి యాజమాన్యం మొండివైఖరి మార్చుకొని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించి, సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు.