విలేకరులపై పోలీసుల ఓవరాక్షన్

Published: Tuesday August 31, 2021
పరిగి 30 ఆగస్టు ప్రజా పాలన ప్రతినిధి : చట్టానికి అందరూ సమానమే.నిబంధనలు ఎవరు ఉల్లగించినా అందరూ శిక్షార్హులే అంటూ చెప్తున్న పోలీసులు మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు నడిపే వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు ఉన్నా అవి కేవలం సామాన్యులకి మాత్రమే అన్నట్లుగా పోలీసుల వ్యవహార శైలి మారింది. ఓ ప్రక్క అధికారులు గ్రామాల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అయితే దోమ పోలీసులు మాత్రం నిబంధనల ఆచరణలో మాత్రం విఫలం అవుతున్నారు. నిబంధనలు యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఎందరో మృత్యువాత పడుతున్నారు.అయితే ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక దృష్టి సారించారు.మితి మీరిన వేగం, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ ధరించక పోవడం వంటివే ప్రధాన కారణాలుగా గుర్తించి వాటిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటి నుండి గ్రామాల్లో సైతం ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అప్పటి నుంచి ఏదో ఒక కారణం చూపిస్తూ పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేస్తూ చలానాలు విధిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇలా సామాన్యులపై అధికారం చలాయిస్తూ వారు మాత్రం యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్యవహార తీరును కంచే చేను మేసిందన్న చందంగా మారిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న పోలీసు అధికారుల ఫోటోలు తీస్తున్న జర్నలిస్టుల పట్ల దోమ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తిస్తూ, మీకు చేతనైంది చేసుకోండి నా 10 సంవత్సరాల సర్వీస్ లో మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాము అంటూ జర్నలిస్టుల హక్కుల కు భంగం కల్గించే విధంగా ప్రవర్తిస్తూ జులూం చూపిస్తున్నారు. జర్నలిస్టులకు ఇలా జరిగితే సామాన్య ప్రజలకు మరి ఇంకా ఎలా ఉంటుందని అక్కడ అక్కడ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేటి ప్రజాస్వామ్య కాలంలో నాలుగో స్తంభంగా చెప్పుకోబడే పాత్రికేయ రంగాన్ని కించపరుస్తున్న అధికారుల పట్ల ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలంటూ పలువురు అంటున్నారు.