ఆధ్యాత్మిక చింతనే మానవగడకు సార్థకత

Published: Monday December 20, 2021
ఎల్లకొండ సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : ఆధ్యాత్మిక చింతనే మానవగడకు సార్థకత చేకూరుతుందని శ్రీ సాయిబాబా దేవాలయ ట్రస్టు అధ్యక్షులు, నవాబ్ పేట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నవాబ్ పేట్ మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామ సమీపంలో శ్రీ సాయిబాబా, దత్తాత్రేయ, గణపతి, నందీశ్వర, శిఖర, ప్రతిష్ఠాపన మహోత్సవం 14 డిసెంబర్ 2021 మంగళవారం నుండి 18 డిసెంబర్ 2021 శనివారం వరకు అంగరంగ వైభవంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. రోజువారీ పని వత్తిడి ఎంత ఉన్నా కనీసం ఒక గంటైనా ఏకాగ్రతతో తమ ఇష్ట దైవాన్ని పూజించాలని హితవు పలికారు. దైవ చింతనతో మనస్సుకు ప్రశాంతత చేకూరడమే కాకుండా ధైవానుగ్రహంతో తాము అనుకున్న పనులు నెరవేర్చుటకు తోడ్పాటు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దైవ సంకల్పం తోడుంటే మానవ జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతాడని జోస్యం చెప్పారు. సాధించే పనుల పట్ల నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ, సహనం ఉంటే తప్పక విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక ధోరణిలో వివరించారు. దైవ సంకల్పం లేకపోతే ఏదీ సాధించలేమని హెచ్చరించారు. మహోత్కృష్టమైన సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని దైవానుగ్రహంతో పూర్తి చేయగలగడం నా పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు రావుగారి మాణిక్ రెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, కె.సుదర్శన్, సి.లక్ష్మారెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, పి.గోపాల్ రెడ్డి, జి.మాణిక్ రెడ్డి, బి.మహేందర్, ఎల్.దామోదర్ రెడ్డి, భక్తులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.