పురపాలక సంఘాల అభివృద్ధి పనుల ప్రణాళికలు రూపొందించాలి. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల

Published: Wednesday December 28, 2022
మంచిర్యాల బ్యూరో,  డిసెంబర్ 27, ప్రజాపాలన :
 
జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలో ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను పూర్తి స్థాయిలో రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో మున్సిపల్ కమీషనర్లు, అధికారులతో పురపాలక సంఘాల అభివృద్ధిపై సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ వార్డులలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వార్డులలోని అంతర్గత రహదారులు, నివాస ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రతి రోజు ఇంటింటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, మురుగు కాలువలలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు. కూరగాయల మార్కెట్, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను రోడ్డుపై వేయకుండా యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా ఇతరత్రా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ భూములలో మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు నాటిన మొక్కలకు సరైన సమయంలో నీటిని అందించి పరిరక్షించాలని తెలిపారు. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పబ్లిక్ టాయిలెట్లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.