ధర్మాపూర్ గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే ఆనందుకు కృతజ్ఞతలు

Published: Tuesday February 14, 2023
* పీలారం నుండి ధర్మాపూర్ మీదుగా 2.54 కోట్ల నిధులతో 7 కి.మీ. రోడ్డు నిర్మాణం
* ఎమ్మెల్యే చొరవతో విద్యుత్ సమస్యలు పరిష్కారం
* స్వయం పాలనకు ఏర్పడిన నూతన జిపి

* ధారూర్ మండల మాజీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల బుచ్చిరెడ్డి

వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : ధర్మాపూర్ గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ధారూర్ మండల మాజీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల బుచ్చిరెడ్డి ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్ల నిధులతో ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామం నుండి ధారూర్ మండలంలో గల ధర్మాపూర్ గ్రామం మీదుగా 7 కి.మీ. సిసి రోడ్లు, బిటి రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ధర్మాపూర్ గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తన  నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 10 లక్షలు ఆర్థిక సహకారం చేశారని గుర్తు చేశారు. గ్రామంలో, పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ఎమ్మెల్యే చొరవతో సరిచేసినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మున్నూరు సోమారానికి అనుబంధ గ్రామంగా ధర్మాపూర్ గ్రామం ఉండేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన దృక్పథంతో 500 జనాభా గల గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు  చేయడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ధర్మాపూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయుటకు రాత్రింబగళ్లు కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ధర్మాపూర్ గ్రామాన్ని పారిశుద్ధ్యరహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ధర్మాపూర్ గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు తోడునీడగా నిలుస్తారని చెప్పారు. ధర్మాపూర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని పూసగుచ్చినట్లుగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి తోడునీడగా ఎల్లప్పుడూ ఉంటారని ఆకాంక్షించారు.