భాజపా అభ్యర్థి ఎవిఎన్ రెడ్డిని గెలిపించండి

Published: Saturday March 11, 2023
* రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్
వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ వేడుక వేదికలో టిపియుఎస్, జిజెఎల్ఏ, టిజిపిఎఎల్ఏ, టిఆర్ఎస్ఎంఎ సంఘాలు బలపరిచిన భాజపా అభ్యర్థి ఏవిఎన్ రెడ్డికి ఉపాధ్యాయ అధ్యాపక ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన తపస్ జిల్లా అధ్యక్షుడు కె.అంజిరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉంటుందన్నారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఘాటుగా స్పందించారు. భావిభారత పౌరులను తీర్చి దిద్దే వృత్తిలో ఉన్నవారిని చిన్నచూపు చూడడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులా పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించిన ఘనుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. యువతను నిర్వీర్యం చేసేందుకే మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. విద్యాలయాలలో ఉన్న సమస్యలను ఎండగట్టే అభ్యర్థిగా ఏవిఎన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి భాజపా నాయకులు ఎ.చంద్రశేఖర్,  జిల్లా భాజపా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి, జిల్లా భాజపా కార్యదర్శి పాండుగౌడ్, రాష్ట్ర కార్యదర్శి దోమ కమాల్ రెడ్డి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటిగారి శివరాజ్, ఆర్ఎస్ఎస్ కార్యవాహ్ అనంత్ రెడ్డి, తపస్ జిల్లా కార్యదర్శి శ్రీలతారెడ్డి, తపస్ మహిళా కార్యదర్శి కూర గీతానందిని, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.