10వ తరగతి పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలి

Published: Tuesday May 17, 2022
రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
 
మంచిర్యాల బ్యూరో, మే16, ప్రజాపాలన :
 
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి సందీపక్కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్య, పోలీసు సంబంధిత శాఖల అధికారులతో 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ఈ నెల 23 నుండి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని, ప్రధానంగా ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 
పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతాయని, పరీక్ష ప్రారంభం అయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లతో పాటు వైద్య సేవల కొరకు ఆశ వర్కర్, ఆరోగ్య కార్యకర్తలను నియమించి ఓ.ఆర్.ఎస్, ప్యాకెట్లు, మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష సమయానికి అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు బస్సులు నడిపించాలని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్ తో కలిసి జిల్లా విద్య, రవాణ, పోలీసు, పంచాయతీ శాఖల అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా రవాణ అధికారి కిష్టయ్య, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area