ఈ నెల 25 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు

Published: Tuesday October 19, 2021
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 18 అక్టోబర్ ప్రజాపాలన : ఈనెల 25 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించబడరని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుపర్చడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. తహసీల్దార్లు, ఆర్.డి.ఓ.లతో ఫ్లైయింగ్ స్క్వేర్డు టీమ్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.  ప్రతి సెంటర్ వద్ద వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కోరారు.  పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండ ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని, పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు త్రాగు నీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా నోడల్ అధికారి శంకర్ నాయక్, వికారాబాద్ ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య శాఖ అధికారి తుకారం, డిఎస్పి సత్యనారాయణ, విద్యా శాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ ఘని, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.