ఉపకార వేతనాలు చెల్లించాలంటూ ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

Published: Thursday November 18, 2021

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పెండింగ్ లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ సంజీవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నేడు ప్రభుత్వం విద్యార్థులను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ లు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అన్నారు. స్కాలర్షిప్ లు ప్రభుత్వ భిక్ష కాదు, పేద విద్యార్థుల హక్కు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందక ఉద్యోగాలకు ఇబ్బందిగా మారింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని పెండింగ్ లో ఉన్న ఉపకారవేత్తనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ లు వెంట వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. విద్యరెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆర్థిక శాఖ సరిగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యార్థులను వేధిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పైనే ఆశలు పెట్టుకున్న అనేక మంది పేద విద్యార్థులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో ఉన్నత, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 12.5 లక్షల మంది విద్యార్థులకు రూ3,816 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఆర్థిక శాఖ స్తంభింపజేసింది. ఈ బకాయిలు గత రెండేళ్లుగా పేరుకుపోయాయి. కొన్ని కాలేజీల మేనేజ్‌మెంట్‌లు కోర్సులు పూర్తయిన తర్వాత కూడా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకుంటున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 2019-20లో 1,500 కోట్ల రూపాయల బకాయిలను ఇటీవల విడుదల చేయడానికి ఆర్థిక శాఖ సంక్షేమ శాఖలకు టోకెన్లను కూడా జారీ చేసింది. కానీ ఆకస్మాత్తుగా చెల్లింపులను ఆపేసింది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షల కన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, బీసీ, ఈబీసీ మరియు మైనారిటీ విద్యార్థులు వార్షిక కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కన్నా తక్కువ మరియు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉన్న వారు ఈ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు. ప్రతీ సంవత్సరం, దాదాపు 5.45 లక్షల మంది కొత్తగా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేకుంటారు. దాదాపు 7.99 లక్షల మంది రెన్యువల్ చేసుకుంటారు. ప్రభుత్వం సంవత్సరానికి రూ.2,300 కోట్లను ఫీజు రీయింబర్స్ కోసం విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరానికి కేవలం రూ.784 కోట్లను మాత్రమే విడుదల చేసింది. మరియు 2020-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ టెక్నీకల్ సెల్ కన్వీనర్ శశిధర్ రెడ్డి, నగర కార్యదర్శి హేమంత్ కుమార్, మహిళా నాయకులు అర్పిత, నాయకులు వినోద్, రాజు, శేఖర్, సిద్దు, శివానందు, అభిలాష్, అరవింద్, సాయికృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.