పేదవాడి నడ్డి విరుస్తున్న ఇసుక, మట్టిమాఫియా

Published: Tuesday February 15, 2022
బోనకల్, ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల వ్యాప్తంగా ఇసుక మట్టి మాఫియా పేదవాడి పాలిట శాపంగా మారాయి. సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్య ప్రజలను ఇసుక, మట్టి మాఫియా జలగ లాగా పీక్కు తింటున్నారు. మండల వ్యాప్తంగా ఎవరైనా సామాన్యుడు నూతనంగా నిర్మాణం చేపట్టాలంటే ఇసుక, మట్టి తొలకాలను అధిక ధరలను చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇసుక మరియు మట్టి తోలకాలు చేపట్టేవారు సిండికేట్ గా తయారయ్యి వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు.మండలంలో ఒక ట్రక్కు మట్టి కావాలంటే 1500, ఒక ట్రక్కు ఇసుక కావాలంటే 6000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు అందరూ సిండికేట్ గా మారటం వలన తప్పనిపరిస్థితుల్లో అధిక ధరలు చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు. సామాన్యులు అంత ధరలు చెల్లించుకోలేక నిర్మాణాలను చేపట్టకుండా వాయిదా వేసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సిండికేట్ వ్యాపారస్తుల పై తగిన చర్యలు తీసుకొని సామాన్యులకు అందుబాటులోకి ఇసుక మట్టి తోలకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.