ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు

Published: Thursday September 09, 2021
చేవెళ్ళ మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజాపాలన : భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. చెరువులు కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. నాసిరకమైన రోడ్ల నిర్మాణంతో వరద ఉధృతికి కొట్టుకొని పోయాయి. వాగులకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల రాకపోకలు స్థంభించాయి. అత్యవసర పరిస్థితుల్లో వాగులను దాటే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి మృత్యువాత పడుతున్నారు. వాగుల్లో కొట్టుకొని పోయేవారు ఈత వచ్చిన వారు మాత్రమే బతికి బట్టకడుతున్నారు. ఈత రానివారు యమలోకానికి ప్రయాణమవుతున్నారు. వరద ఉధృతిని సరైన అంచనా వేయలేక వాగు దాటే ప్రయత్నంలో అతి విశ్వాసంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వరదల్లో కొట్టుకొనిపోయే వారిని, మృతి చెందిన శవాలను ఒడ్డుకు చేర్చే గజ ఈతగాల్ల అవసరం అత్యంతావశ్యకం. వికారాబాద్ జిల్లా పరిధిలో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యువకులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు. కోటపల్లి ప్రాజెక్ట్ వద్ద లైఫ్ గార్డ్స్ గా పని చేస్తున్న యువత ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిస్తున్నారు. రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీలో శిక్షణ పొంది ప్రొఫెషనల్ లైఫ్ గార్డ్స్ గా తమ సేవలను అందిస్తున్నారు. వరద ప్రమాదాలు జరిగినప్పుడు మేము ఉన్నామని బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. వరదల కారణంగా జిల్లాలోని తిమ్మాపూర్ వాగులో కొత్త పెళ్ళి జంటలోని నవ వధువుతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. వికారాబాద్ డిఎస్పి సంజీవరావు ఫోన్ కాల్ పిలుపు మేరకు జెకెఎంఆర్ కో ఆర్డినేటర్ సార రాములు వెంటనే స్పందించి లైఫ్ గార్డ్స్ చక్కల శ్రీనివాస్, జీడిగింజల శ్రీనివాసులను సంఘటన స్థలానికి హుటాహుటిన పంపారు. వరదలో గల్లంతైన ప్రయాణీకుల కోసం రెండు రోజులు వెతికారు. వరద ప్రవాహంలో సుమారు 7 కి.మీ. దూరం వరకు వెతికారు. బంట్వారం మండలం బార్వాద్ గ్రామ సమీపంలో ముగ్గురి మృతదేహాల ఆచూకి లభ్యమయ్యింది. ధారూర్ మండల పరిధిలోని దోర్నాల్ వాగులో ఇద్దరు గల్లంతయ్యారని ధారూర్ ఇన్ స్పెక్టర్ ద్వారా జెకెఎంఆర్ కో ఆర్డినేటర్ సార రాములుకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించి లైఫ్ గార్డ్ మల్లేశంకు ఫోన్ చేశారు. లైఫ్ గార్డ్స్ మల్లేశం, దశరథం, రవీందర్, రాజు, లింగమయ్య, శేఖర్, గోవర్ధన్ శ్రీకాంత్, సత్యనారాయణలు కలిసి వెతకగా మృతి చెందిన గోరయ్య మృతదేహం లభించింది. అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు లైఫ్ గార్డ్స్ యువకులను వేనోల్లతో అభినందించారు. యువత శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటే సాధించలేని పని ఉండదని నిరూపించారు.