పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కమిషనర్ డిఎస్ చౌహాన్

Published: Wednesday April 05, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
త్వరలో జరుగనున్న తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నేరేడ్మెట్ లోని రాచకొండ కమీషనర్ కార్యాలయంలో పరీక్షా నిర్వాహకులు మరియు నోడల్ ఆఫీసర్లతో పోలీస్ కమిషనర్ చౌహాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏప్రిల్ 8,9 తేదీల్లో సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించిందని, అభ్యర్థులకు హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభం అయిందని తెలిపారు. పరీక్షా నిర్వహణ కేంద్రాలుగా ఎంపిక చేయబడ్డ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇన్విజిలేటర్ లకు అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేసే  విధానం మీద శిక్షణ ఇవ్వాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్ష రోజున ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా  పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు సక్రమంగా చేసుకోవాలని సూచించారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్ధులు పరీక్షల్లో మంచి ఫలితం సాధించి పోలిసు శాఖలో చేరి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు. 
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు జాయింట్ సీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు క్రైమ్ డీసీపీ శ్రీనివాస్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.