జిల్లాలో పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Wednesday September 28, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 27, ప్రజాపాలన  :
 
జిల్లాలో పిల్లల ఎదుగుదలపై సంబంధిత అధికారుల సమన్వయంతో పర్యవేక్షణతో పాటు పోషకాహార లోప రహిత జిల్లాగా మంచిర్యాలను తీర్చిదిద్దడంలో అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించి నివేదిక తయారు చేసి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ, సంక్షేమశాఖల సమన్వయంతో గ్రామాలలో ఆశ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా అవసరమైన పోషకాహార పంపిణీ, వైద్య సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలో అతితీవ్ర పోషకాహార లోపం గల వారు 250 మంది, తక్కువ తీవ్ర పోషకాహర లోపంతో బాధపడుతున్న వారు 713 మంది పిల్లలు ఉన్నారని, వారు పోషకాహార లోపాన్ని అధిగమించే విధంగా అతి తీవ్రత గల వారికి రోజుకు 4 సార్లు, తక్కువ తీవ్రత గల వారికి 2 సార్లు బాలామృతం అందించాలని తెలిపారు. అంగన్వాడీ యూనిట్గా ఆశా కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలకు సంబంధిత పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి ప్రతి నెల 5వ తేదీన వైద్యాధికారికి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. సుబ్బారాయుడు, జిల్లా సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, ప్రోగ్రామ్ అధికారి డా. నీరజ, డా.అనిత, ఉప వైద్యాధికారి డా. విజయనిర్మల, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అరవింద్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సి.డి.పి.ఓ.లు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.