వరుణ దేవా... శాంతించు భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పంట పొలాలు నీట ము

Published: Wednesday July 27, 2022

వికారాబాద్ బ్యూరో 26 జూలై ప్రజా పాలన : దంచి కొడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటు చూసినా నీటిమడుగులే దర్శనమిస్తున్నాయి. కాలు గడప దాటే పరిస్థితి లేదు. ఎడతెరిపలేని వర్షాలతో నిత్యవసరాలు నిండుకున్నాయి. చిన్నారులు వృద్ధులు పలు జబ్బులతో అల్లాడుతున్నారు. మందులు తెచ్చుకోవడానికి కూడా వరుణుడు ససేమిరా అని గుడ్లురుముతున్నాడు. రాత్రి వేళలో ఆదమర్చి నిద్రపోతే వరదతో ఆగమాగం అవుతున్న ప్రజలు. లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఎప్పుడు వరద నీళ్లు ఇండ్లలోకి వస్తాయోనని భయం గుప్పెట్లో బిక్కు బిక్కు మని బతుకుతున్నారు. కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న ప్రజల కష్టాలు ఆగమ్య గోచరం. అధికారులు ప్రజాప్రతినిధులు ఎంత నచ్చచెప్పిన తమ ఇళ్లను వదిలి ఆవాస కేంద్రాలకు రాలేకపోతున్నారు. వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ ఎర్రవల్లి గ్రామాలను పర్యటించిన డిప్యూటీ సీఈవో సుభాషిని ఎంపీడీవో సత్తయ్య ఎంపీ ఓ నాగరాజు లు క్షేత్రస్థాయిలో వరద ఉధృతిని పరిశీలించారు. ఎర్రవల్లి గ్రామ ప్రవేశ ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న రెండు చెరువులను ఒకే చెరువుగా మార్చిన వరద. అత్యవసర పని ఉన్నా కూడా చెరువును దాటే సాహసం చేయలేకపోతున్న ఎర్రవల్లి గ్రామ ప్రజలు. గ్రామంలోని ప్రజలు రాకపోకలు కొనసాగించడానికి అనుమతి నిరాక నిరాకరిస్తున్న అధికారులు. నారాయణపూర్ గ్రామ సమీపంలోని వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు జోరుగా ప్రవహిస్తుండడంతో పూర్తిగా రాకపోకలు నిలిచాయి. వరుణ దేవా ఇక శాంతించు చాలు ఇప్పటికే పంట నష్టం తీవ్రంగా జరిగింది. జబ్బులతో బాధపడుతున్న చిన్నారులు వృద్ధులకు మందులు తెచ్చి ఇవ్వలేకపోతున్నారు.  ఇంట్లో నిత్యవసరాలు నిండుకున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు మరీ భీతిల్లుతున్నారు.