కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం, హాజీపూరలో బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి హ

Published: Friday January 06, 2023

కోరుట్ల, జనవరి 05 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంతో పాటు హాజీపూరలో బస్తీ దవాఖానాను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్ రవి, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.బీజేపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు, మత కలహాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల బతుకు దెరువు కోసం ఆరాట పడుతూ తెలంగాణ ప్రజల పేగు బంధంగా ఉందని అన్నారు.  గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం చేసిందేమి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ కుల్లుకుంటుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుండటంతో నిరుద్యోగ యువత సంతోష పడుతున్నారని తెలిపారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓర్వలేక రాజకీయ లబ్ధి కోసం ఇన్ని నోటిఫికేషన్‌లు ఎలా ఇస్తారని విమర్శలు చేయడం తగదన్నారు.రాష్ట్రం వచ్చాక వైద్య ఆరోగ్య శాఖ ముఖ చిత్రం మారిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ‌లో మూడే డయాలసిస్ సెంటర్‌లు ఉండేవని, ఇప్పుడు వాటిరి 122 చేశామన్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ తెచ్చామని తెలిపారు. తెలంగాణలో 200 ఉన్న ఐసీయూ బెడ్‌లను 6000 లకు పెంచామన్నారు. గత ప్రభుత్వాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇప్పటి వరకూ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకరాలేదని, కాని తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మరో రెండు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 950 మంది డాక్టర్‌లను కొత్తగా నియమించామని స్పష్టం చేశారు.ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే 90 మంది డాక్టర్‌లను నియమించామన్నారు. జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాల తెచ్చి, వైద్య విద్యను పేద విద్యార్ధుల‌కు అందుబాటులో ఉంచామన్నారు. సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, నిధులను పెంచి పేదలకు ఆరోగ్య సేవలను చేరువ చేశారన్నారు. హెల్త్ సెక్టార్‌లో తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ అని కేంద్ర ప్రభుత్వమే తేల్చిందని వెల్లడించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ హయాంలో 6 శాతం ఉన్న నిరుద్యోగితను 8.3 శాతానికి పెరిగిందని, తెలంగాణ‌లో 4.1 మాత్రమే నిరుద్యోగిత రేటు ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సాగుకు ప్రభుత్వం సమృద్ధిగా జలాలు అందిస్తుందని, గుర్తు చేశారు.సాగు, తాగు నీరుతో ప్రజలకు, రైతులకు సమృద్ధిగా జలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్‌రావు, తదితరులు పాల్గొన్నారు.