కరోన కట్టడికి స్వీయ నిర్బంధమే శరణ్యం

Published: Wednesday May 05, 2021
ఇంట్లో ఐసోలేషన్ సదుపాయం లేని వారికి ఆసుపత్రులు
పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా ఆక్సీజన్ స్థాయులు తెలుసుకొనుట
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు. ఆనంద్
వికారాబాద్ మే 04 ప్రజాపాలన బ్యూరో : కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ నిర్బంధమే శరణ్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ హనుమంతు, ఉపసర్పంచ్ నజీమున్నీసా గఫార్, కార్యదర్శి మధుకర్ రెడ్డిల ఆధ్వర్యంలో కరోన తీవ్రతను పరిశీలించుటకు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రపంచ మానవాళికే కోవిడ్ 19 ఒక ప్రశ్నగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ప్రజలు స్వీయనిర్భందం ఒక్కటే మార్గమని హితవు పలికారు. ప్రజలు ఎవరు కూడా భయ బ్రాంతులకు గురికావొద్దని భరోసా కల్పించారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లో సదుపాయం లేకపోతే వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి, మహావీర్ హాస్పిటల్, సాయి డెంటల్ కళాశాలలో ప్రభుత్వం తరపున తగిన సదుపాయాలు చేశామన్నారు. పల్స్ ఆక్సీ మీటర్ సహాయంతో మన శరీరంలో ప్రాణ వాయువు స్థాయిని ఎలా తెలుసుకోవాలో అవగాహన కల్పించారు. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టీకా ఇస్తున్నారని, దాని పై ఏఎన్ఎం లకు, పంచాయతి సెక్రటరీలకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం గ్రామ ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. రిజిస్ట్రేషన్ తెలియని వాళ్ళకి సిబ్బంది  సహాయపడాలన్నారు. ప్రజలందరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్ షిండే, డిఎస్ఒ అరవింద్ కుమార్, మెడికల్ ఆఫీసర్ ప్రశంస, ఎంపిఒ నాగరాజు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్, మాజీ జెడ్పీటీసీ నర్సింలు, నాయకులు హన్మంతు, గఫర్, ప్రభాకర్ రెడ్డి, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.