దామస్తాపూర్ లో మిషన్ భగీరథ నీరు రావట్లేదు

Published: Friday September 24, 2021
నీళ్ళు రావట్లేదని మా నాన్న పిట్టల శ్రీనివాస్ అడిగితే సర్పంచ్ దాడి చేస్తాడా?
మా నాన్నకు జరుగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని బాధితుని పిల్లలు ప్రశ్నించారు
దామస్తాపూర్ లో పౌరునిపై దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డి పై విచారణ జరిపిన డిఎల్పిఓ అనిత, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ 
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : దామస్తాపూర్ గ్రామంలో గత రెండు నెలల నుండి మిషన్ భగీరథ నీరు రావట్లేదని గ్రామస్థులు తెలిపారని డిఎల్పిఓ అనిత, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ లు సంయుక్తంగా అన్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో గల మర్పల్లి మండలానికి చెందిన దామస్తాపూర్ గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశాల మేరకు డిఎల్పిఓ అనిత, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ లు పౌరుడు పిట్టల శ్రీనివాస్ పై గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి (ఘర్షణ) దాడి చేసిన ఘటనపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా వారు ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ.. దామస్తాపూర్ గ్రామంలో జరిగిన ఘర్షణ, దాడికి సంబంధించిన పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారని పేర్కొన్నారు. గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టామని వివరించారు. గ్రామస్థుల సమక్షంలో విచారణ చేయగా మిషన్ భగీరథ నీళ్ళు గత 2 నెలల నుండి రావడం లేదని సర్పంచ్ దృష్టికి తెచ్చానని బాధితుడు పిట్టల శ్రీనివాస్ తెలిపాడని స్పష్టం చేశారు. నీళ్ళు అడిగినందుకే నన్ను చితక్కొట్టి బూటు కాలితో తన్నడమేమిటని ప్రశ్నించాడని వివరించారు. ఈ విషయం గురించి గ్రామస్థులను అడుగగా వారి మధ్య గొడవ జరిగిన సమయంలో గ్రామస్థులు అక్కడలేమని చెప్పారు. నీళ్ళు అడిగితేనే వ్యక్తిపై దాడి చేసే పరిస్థితి ఏర్పడుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మిషన్ భగీరథ నీటి గురించి ఏఈ కి చరవాణిలో మాట్లాడగా మరమ్మతుల పనులు జరుగుతుండడంతో నీటి సరఫరా చేయలేదని చెప్పాడని అన్నారు. ఇక నుండి రోజు విడిచి రోజు నీళ్ళు వస్తాయని తెలిపారని ఉద్ఘాటించారు. మిషన్ భగీరథ నీళ్ళు రాని నాడు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయాలని డిఎల్పిఓ అనిత పంచాయతీ కార్యదర్శి శ్రీశైలంకు సూచించారని చెప్పారు. బాధితుని పిల్లలు మాట్లాడుతూ.. మా నాన్న పిట్టల శ్రీనివాస్ కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గ్రామ సర్పంచ్ గ్రామానికి తండ్రిలాంటి వాడని సమస్యలు వస్తే సర్ది చెప్పాలి. కానీ, మూర్ఖత్వంతో పైశాచికంగా దాడి చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యల గురించి ఎవరైనా సర్పంచ్ జైపాల్ రెడ్డిని అడిగితే ఇలాగే వ్యవహరిస్తాడని గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బతకాల్సి రావచ్చోమోనని సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, రాజకీయ ప్రతినిధులు సర్పంచ్ కు నచ్చజెప్పాలని బాధితుని పిల్లలు, గ్రామస్థులు కోరారు.