తెలంగాణలో ఆదర్శవంతమైన పల్లె పాలన

Published: Thursday December 16, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 15 డిసెంబర్ ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని గుండ్ల మర్పల్లి, పిల్లిగుండ్ల గ్రామాలలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గుండ్ల మర్పల్లి సర్పంచ్ కె.శివకుమార్, పిల్లిగుండ్ల సర్పంచ్ కుమ్మరి పాండులతో కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనాదక్షతో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవకాశం కల్పించి పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామాలు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ లు వంటి వాటితో పల్లె పల్లె అభివృద్ధి చెందేలా నూతన శకం ప్రారంభించారన్నారు. గ్రామాలలో మురుగు కాలువల నిర్మాణం మరియు రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. మిషన్ భగీరథ నీరు అందించడంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. గ్రామాలలో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి గ్రామంలో మరియు పంట పొలాల వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరి చేయాలని, విద్యుత్ అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మాణం అయిన కాలనీలలో విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ అందించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, ఎంపిపి భట్టు లలిత రమేష్, వైస్ ఎంపిపి మోహన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయబ్ గౌడ్, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్, ఎంఆర్ఓ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.