ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Tuesday July 26, 2022

మంచిర్యాల బ్యూరో, జూలై 25,

ప్రజాపాలన :

 

ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాలకు చెందిన ఉప్పులేటి పెంటయ్య తన తండ్రి పేరిట 75 సం॥లుగా ఉన్న పట్టా భూమిలో నిర్మించిన ఇంటిలో నివాసం ఉంటున్నానని, నా హద్దు చుట్టూ పెంచన్ ఏర్పాటు చేస్తుండగా కొందరు వ్యక్తులు ఇట్టి భూమిలో మాకు వాటా ఉంది అంటూ దౌర్జన్యంగా వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇట్టి విషయంపై తగు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామస్తులు వారి దరఖాస్తులో కొలాం గిరిజనులమైన మాకు ప్రభుత్వం అసైన్మెంట్ భూమి అందించడంతో సాగు చేసుకుంటూ ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, రెవెన్యూ రికార్డులలో మా పేర్లు ఉన్నప్పటికీ మాకు ఎలాంటి సమాచారం లేకుండా పై భూమిని స్వాధీన పర్చుకొని ఫుడ్ ప్రాసెసింగ్ నిర్మాణం ప్రారంభిం చారని, ఇట్టి విషయమై మాకు న్యాయం చేయాలని కోరారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన ముడిమ డుగుల దుర్గయ్య తన తండ్రి పేరిట ఉన్న లావుని పట్టా భూమిని తన పేరిట మార్పు చేసి ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన ఆసరెల్లి సమ్మయ్య అలియాస్ రాజేందర్ గతంలో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్న తాను 2002లో జనజీవన స్రవంతిలో కలిసిపోయానని, నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదని, ప్రభుత్వం తరుపున అందించే భూమి, ఇంటి స్థలము, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన రామటెంకి లక్ష్మీ తనకు అందుగులపేట గ్రామ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమికి ప్రభుత్వం అందించే రైతుబంధు ఒక సంవత్సరం నుండి రావడం లేదని, రైతు బంధు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను ఆయా సంబంధిత శాఖలకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.