జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Published: Tuesday September 21, 2021
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, జిల్లా అధ్యక్షులు సంజీవ్ 
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజాపాలన : జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూం లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, జిల్లా అధ్యక్షులు సంజీవ్ డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయని నాయకులు అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్లు ఇవ్వాలని, హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని, కరోనతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు రామ్ చందర్. చందు, భాస్కర్, శ్రీధర్ నాయక్, వెంకటేష్, నరసింహ, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.