పంటలు ఎండిపోకుండా రైతన్నలపై కనికరం చూపించండి గోవిందాపురం ఏ గ్రామ రైతు షేక్ పకీర్ సాహెబ్

Published: Wednesday February 01, 2023

బోనకల్, జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని పంటలు ఎండిపోతుంటే మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాలు , విద్యుత్ అధికారులు ఏమి చేస్తున్నారని గోవిందాపురం ఏ గ్రామ రైతు షేక్ ఫకీర్ సాహెబ్ ప్రభుత్వం పై, విద్యుత్ అధికారులపై మండిపడ్డారు. త్రీ ఫేస్ కరెన్ట్ లేక వారం రోజుల నుండి మొక్కజొన్న ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి 24 గంటల విద్యుత్ కోసం, సాగర్ నీటి కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారని,అయినా సరే ప్రభుత్వ అధికారులు రైతన్నలపై కనికరం చూపించడం లేదని, పంటలు ఎండి పోతుంటే దిక్కు తోచని స్థితిలో రైతన్నలు ఉన్నారని, త్రీ ఫేస్ కరెన్ట్ అయితే 3 గంటలు, సాగర్ నీళ్ళు అయితే నాలుగు రోజులు ఇచ్చి మమా అంటున్నారని రైతు వాపోయాడు.ఆ మూడు గంటల త్రీ ఫేస్ కరెన్ట్ తో, నాలుగు రోజుల సాగర్ నీళ్ళ తో ఎన్ని ఎకరాల పంటలు తడపగలమో అధికారులే చెప్పాలని రైతు అధికారులను డిమాండ్ చేస్తున్నాడు. ఇటువంటి సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపినా ఏ అధికారి, ప్రజా ప్రతినిదుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. రైతు దేశానికి వెన్నుముక అనే నినాదం నిజం అయితే , వడ్డించే వాడు కాదు పస్తులు ఉండి పండించే వాడు కావాలి అనుకుంటే రైతన్నలపై కనికరం చూపించి చేతికొచ్చిన పంట ఎండిపోకుండా 24 గంటల విద్యుత్, సాగర్ నీళ్లను పూర్తిగా పంటలు పండించే వరకు వదలాలని మండల రైతన్నలు కోరుతున్నారు. లేనిచో చేతికి వచ్చిన పంట ఆగమైతే రైతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమని అధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.