హోలీ పండగ విశిష్టత ఏంటి, ఎలా జరుపుకుంటారు

Published: Tuesday March 07, 2023
బోనకల్, మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి :దేశమంతట అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి.తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటిరోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు. ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. హోలీ వేడుకలు
 ప్రవాసభారతీయులు ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు. కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికి ఎంతో ఉత్సాహం. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు.