అఖిలపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేయడం సరి కాదు

Published: Tuesday September 28, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోమవారం శాంతి యుతంగా బంద్ నిర్వహిస్తున్న అఖిల పక్ష పార్టీల నాయకుల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నామని, వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ మూడు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయకుండా వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నారు. అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా శాంతి యుతంగా భారత్ బంద్ నిర్వహిస్తూ ఉద్యమ కారులను  నాయకులను పోలీస్ లు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు  తీసుకువెళ్లి అక్రమ అరెస్ట్ లు చేయటం సరైన పద్దతి కాదని, ప్రజలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు ఉద్యమాలు ఆగవని  హెచ్చరించారు. వెంటనే  వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని, రైతులను ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని లేదంటే భారీ ఎత్తున ఉద్యమాలు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.