అనాధలను సోషల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ గా ప్రభుత్వం గుర్తించాలి..

Published: Friday August 13, 2021
అమీర్ పేట్ జోన్: ఆగస్టు 12 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రపంచం లోనే అత్యున్నత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగంలో అనాధలకు చోటు లేకపోవడం బాధాకరమని, అనాధల కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్ మెంట్ (ఫోర్స్) సభ్యులు సిద్దం శ్వేత, కమతం రజిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనాధ బిడ్డల కన్నీటి ఘోష ఏ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. అనాధ హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ బిల్లును రూపొందించామన్నారు. గత నెల 31 నుంచి ఈ నెల 8 తేదీ వరకు చలోఢిల్లీ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ లోని కేంద్ర మంత్రులను, అన్ని పార్టీల నాయకులను కలిసి తమ ఆవేదనను తెలిపామన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రులు  కిషన్ రెడ్డి, కిరణ్ రిజుజి, స్మృతి ఇరానీ లతో పాటు వివిధ శాఖల అధికారులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రభుత్వమే అనాధ పిల్లలను అమ్మ,నాన్న గా బాధ్యత ను తీసుకోవాలని, కోవిడ్ వల్ల అనాధలుగా మారిన పిల్లల స్థితి గతులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘం నియమించడం హర్షణీయం అని, కేబినెట్ సబ్ కమిటీ అనాధ పిల్లలతో పాటు అనాధ హక్కుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనాధ అన్న పదం చాలా దయనీయంగా ఉందని, తాము ఆత్మ గౌరవంగా ఉండేలా అనాధ అన్న పదానికి సోషల్లి ఛాలెంజెడ్ పర్సన్ గా గుర్తించాలని కోరారు. అనాధలకు నిర్వచనం ఇవ్వాలని, అలాగే విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫోర్స్ సభ్యులు నీరజ, ప్రియాంక, రవళి, తదితరులు  పాల్గొన్నారు.