కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday April 26, 2022
బోనకల్, ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత నిస్తుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. సోమవారం నాడు బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగిన మన ఊరు - మన బడి కార్యక్రమం లో పాల్గొని పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని అందులో భాగంగా మన ఊరు - మన బడి పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నాణ్యమైన విద్య అందించాలని అందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించారానీ చర్యలు చేపట్టిందన్నారు. మన ఊరు - మన బడి తో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారనున్నాయని పేర్కొన్నారు. పాఠశాల విద్యలోనే కొత్త ఒరవడి మన ఊరు - మన బడి అని తెలిపారు. భవిష్యత్తు లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి అవసరమైన మరమ్మతులు చేయడం, డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో చదువుకునే వాతావరణాన్ని కల్పించడం, ఎన్ రోల్మెంట్ విద్యార్థుల హాజరు శాతం పెంచడం నాణ్యమైన విద్యాబోధన కల్పించడం లాంటి అంశాలే మన ఊరు - మన బడి ముఖ్య ఉద్దేశo అని కొనియాడారు. సామాజిక విప్లవంలా పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని దీనితో పూర్తిగా పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.