బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలి

Published: Thursday September 01, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 30 ఆగస్టు ప్రజా పాలన : బ్యాంకర్లు రైతులకు పంట రుణాలతో పాటు మత్స్య కార్మికులకు, గొర్ల పెంపకం దారులకు  విరివిగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఈ ఆర్థిక సవత్సరంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్, 2022 వరకు జరిగిన ప్రగతిపై బ్యాంకర్లతో  డిసిసి మరియు డి ఎల్ ఆర్ సి సమీక్షా సమావేశం నిర్వహించారు.   ఈ సదర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష 14 వేల మంది రైతులకు రూ. 1,457 కోట్ల రుణాలు అందించే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 75,360 మంది రైతులకు 664 కోట్లు రుణాలు మంజూరు చేసి 45.60 శాతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు.  వ్యవసాయ కాల పరిమితి రుణలు లక్ష్యం ఒక వెయ్యి 6 కోట్లు కాగా, 126 కోట్ల రుణాలను అందజేసి 13 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు.  సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు గాను ఒక వెయ్యి 16 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు  142 కోట్లు మంజూరు చేసి 14 శాతం లక్ష్యం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.  వీధి వ్యాపారులకు రెండవ విడతలో భాగంగా ఒక్కొక్కరికి 20 వేల చొప్పున జిల్లాలో 2460 మందికి రుణాలు అందించే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1426 మంది వీధి వ్యాపారులకు 3 కోట్ల రుణాలు అందించి 55 శాతం లక్ష్యం సాధించడం జరిగినదని, ప్రతి వీధి వ్యాపారికి క్యూఆర్ కోడ్ అందజేసి డిజిటల్ లావాదేవీలు జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ 13,218 సంఘాలకు 442 కోట్ల ఋణ లక్ష్యం కాగా, 2856 సంఘాలకు రూ. 146 కోట్ల రుణాలు అందించి 33 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని కలెక్టర్ తెలియజేసినారు. కొత్త పంట రుణాలను, మత్స్య కారులకు, గొర్ల కాపరులకు ఈసారి విరివిగా రుణాలు అందించాలని, అలాగే యస్సి, యస్టి, మైనారిటీ లకు సంబందించిన పెండింగ్ రుణాలను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు ఆదేశించారు.  వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతు వేదికలలో రైరులతో సమావేశాలు నిర్వహించి పంట రుణాల వివరాలను సేకరించి అందజేయాలని సూచించారు.  మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా వారి పరిధిలో పూర్తి వివరాలు సేకరించి అందించాలని సూచించారు.  బ్యాంకుల వారిగా అన్ని శాఖల బ్యాంక్ మేనేజర్లతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా చూడాలని బ్యాంకర్లకు, అధికారులకు కలెక్టర్ సూచించారు.సమావేశ అనంతరం గత సంవత్సరం అత్యుత్తమ సేవలు అందించిన బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేశారు.  ఇందులో శ్రీరామ కృష్ణ, అనుప్రభ, తరుణీ బాయి, సుధా ప్రమీల, రఘునందన్ గౌడ్, శ్రీనివాస రావు, శివరామ కృష్ణ తదితరులు ప్రశంస పత్రాలను పొందారు.  ఈనెల ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రాత్రి 2:00 గంటల వరకు ప్రత్యేక సేవలందించిన వికారాబాద్ యస్ బి ఐ  మేనేజర్ బి. ఆర్. నాయక్ కు కలెక్టర్ ప్రత్యేక ప్రశంస పత్రం అందజేశారు.

ఈ కార్య్రమానికి ఎల్డిఎమ్ రాంబాబు, ఆర్బీఐ ఎల్డిఓ తేజ్ దీప్ బహరా,  నాబార్డ్ డిడియం ప్రవీణ్ కుమార్, ఎస్బిఐ ఆర్ యం. శ్రీరామ కృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సయ్యద్ యూసఫ్ అలీ, డి ఆర్ డి ఓ కృష్ణన్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.