హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

Published: Friday June 25, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్, జూన్ 24, ప్రజాపాలన బ్యూరో : ప్రకృతి ప్రేమికుడైన సిఎం కేసీఆర్ నూతన చట్టాల్లో గ్రీన్ బడ్జెట్ (పది శాతం) ఉండేలా చట్టం చేశారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే మున్సిపల్ పరిధిలోని హరితహారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైకుంఠదామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వలన స్వచ్ఛమైన గాలి, సరైన సమయంలో వర్షపాతం మొదలైన లాభాలు కలుగుతాయని అన్నారు. హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా నాటే మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. హరితహారం కోసం ఏర్పాటుచేసిన నర్సరీలో జామ, దానిమ్మ, బాదామ్, అల్లనేరడు మొదలయిన మొక్కలు పెంచడం జరిగిందన్నారు.  మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటిన మొక్కలను రక్షించడం మన బాధ్యత అన్నారు. వైకుంఠదామం నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతిమ సంస్కారాల కోసం ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాలతో ప్రతి పల్లెలో,  పట్టణాలలో నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కౌన్సిలర్లు కృష్ణ, సురేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, నాయకులు రమణ, ఏఈ రాయుడు, మున్సిపల్  సిబ్బంది పాల్గొన్నారు.