నిషేధిత మాదకద్రవ్యాలను పూర్తి స్థాయిలో నియంత్రించాలి ఎన్.సి.పి.సి.ఆర్. చైర్పర్సన్ ప్రియాంక

Published: Wednesday January 18, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 17, ప్రజాపాలన  :
 
నిషేధిత మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నియంత్రించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎన్.సి.పి.సి.ఆర్. చైర్పర్సన్ ప్రియాంక కనుంగు అన్నారు. మంగళవారం న్యూఢిల్లీ నుండి జాతీయ బాలల హక్కుల కమీషన్ వారు బాలలలో మాదక ద్రవ్యాలు, వాటి దుష్పరిణామాలు, నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, బాలల హక్కుల సంఘాలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు ఎన్.సి.పి.సి.ఆర్. రూపొందించిన 18 అంశాలపై కూలంకశంగా చర్చించారు. పిల్లలు ఎవరు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, జూనియర్ కళాశాలల విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి వైన్షాపులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వయస్సు అర్హత లేని వారికి పొగాకు ఉత్పత్తులు, వైన్షాపులు, డ్రగ్స్ విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నామని, మారుమూల గ్రామాలు, పురపాలక సంఘాలలో ప్రజలకు తెలిసే విధంగా వివిధ ప్రసార సాధానల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కె. చిన్నయ్య, సి.డబ్ల్యు.సి. చైర్మన్ వాహిద్, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎన్.ఆనంద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ చందన, జిల్లా ఆబ్కారీ, మద్యపాన నిషేధిత శాఖ అధికారి, సెక్టోరల్ అధికారి సర్దార్ అలీ, డి.ఈ.ఎం.ఓ. వెంకటేష్, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.