హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Saturday July 30, 2022

 ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం నాటికి రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా రైతుబంధు వదులుకోవాలని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హ్యాష్ ట్యాగ్ గివిట్ అప్ రైతుబంధు పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చిన్న సన్నకారు రైతులకు రైతుబంధు పథకం గొప్ప వరమని దేశానికి ఆదర్శవంతమైన పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చినా పథకం రాజకీయ నేతలకు, వందలాది ఎకరాల భూములు కలిగిన భూస్వాములకు ఆదాయ వనరుగా మారిందని మండిపడ్డారు. ఓవైపు ప్రభుత్వంలో కొనసాగుతూ, ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ పేద రైతులకు న్యాయం చేసేందుకు తీసుకొచ్చిన పథకం ద్వారా లక్షలు కాజేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరకు విదేశాలలో ఉంటూ సకల భోగాలు అనుభవిస్తున్న వారు సైతం రైతుబంధును తీసుకోవడం విడ్డూరమని అన్నారు. సన్న చిన్న కారు రైతులు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సైతం అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా సుమారు 6000 కోట్ల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. వీటన్నింటి నేపథ్యంలో కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులు ఆగస్టు 15 నాటికి తమ రైతుబంధును స్వచ్ఛందంగా వదులుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తాన కు పది ఎకరాలు ఉండగా ప్రభుత్వం రైతుబంధు ఇచ్చేందుకు ముందుకు రాగా స్వయంగా వదులుకున్నానని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభించిందని ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మంత్రి మల్లారెడ్డి తాము కూడా రైతుబంధును స్వచ్ఛందంగా వదులుకుంటామని చెప్పారని అన్నారు. సదరు మంత్రి ఆగస్టు 15 లోపు రైతు బందును వదులుకుంటే రైతులు, ప్రజలు ప్రశంసించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని లేనిపక్షంలో రైతుల, ప్రజల వ్యతిరేకత ఎదురుకొక తప్పదని హెచ్చరించారు. కేవలం 5  ఎకరాల వరకే రైతుబంధు వర్తించేలా పథకాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈలోపు ఐదు ఎకరాల పైబడ్డ రైతులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రైతుబంధు పొందుతున్న వారు, విదేశాలలో ఉంటూ ఫామ్ హౌస్ లు  నిర్మించుకొని విలాసవంతంగా జీవిస్తున్న వారు స్వచ్ఛందంగా వదులుకోవాలని తాము ప్రత్యేక అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.