ప్రభుత్వ భూముల్ని ప్లాట్లుగా చేసి అమ్ముతుంటే పట్టించుకోని అధికారులు

Published: Thursday June 10, 2021

బెల్లంపల్లి, జూన్ 9, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణం లోని వివిధ ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్లాట్లుగా చేసి  అమ్ముతున్న పట్టించుకునే నాధుడే లేడని పట్టణ అఖిలపక్షం తీవ్రంగా విమర్శించింది. బుధవారం నాడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాల భవనం వెనకాల ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి రెండు లక్షల చొప్పున అమ్ముతున్నారని, అలాగే ఏరియా హాస్పిటల్ ముందున్న టకారియ నగర్ లో ఐదు నుండి పది లక్షలకు గుంట చొప్పున అమ్ముకుంటున్నారని వందలాది ఎకరాల భూమిని కోట్లాది రూపాయలకు అమ్ముతూ అధికార పార్టీ నాయకులు కోట్లకు పడగెత్తుతున్నారని వచ్చిన దాంట్లో 30 శాతం రెవెన్యూ వారికి 30 శాతం మున్సిపల్ వారికి 40 శాతం అధికార పార్టీ బినామీలు పంచుకుంటూ ప్రభుత్వ భూమిని నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే కాంటా చౌరస్తాలోని హనుమాన్ ఆగ్రో దుకాణం యజమాని వెనుక భాగంలో మరింత స్థలాన్ని కబ్జా చేసి లక్షలాది రూపాయల విలువ గల భూమిని కబ్జా చేస్తున్నారని వీటన్నింటిపైనా జిల్లా కలెక్టర్ కు స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని చివరికి కోర్టు ద్వారానైనా ప్రభుత్వ భూముల్ని కబ్జాదారుల నుండి విడిపించి అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని వారు హెచ్చరించారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జ్ గెల్లి  జయ రామ్ యాదవ్, జెఏసి ఉపాధ్యక్షులు అమానుల్లాఖాన్,  కార్యదర్శి ఆడేపు మహేష్,బబ్లూ, తదితరులు పాల్గొన్నారు.