బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Published: Tuesday November 15, 2022
జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 నవంబర్ ప్రజా పాలన : బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం బాలల దినోత్సవం సందర్భంగా చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా బాలల హక్కులకు మద్దతుగా మొదటిరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీచే ప్రారంభించడం జరిగింది.
 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందుగా బాలల అందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చెప్పారు. ముఖ్యంగా చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాలల హక్కులకు మద్దతుగా వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అన్ని వర్గాల ప్రజలు బాలల హక్కుల రక్షణ తమ బాధ్యత అని అనుకున్నప్పుడు బాలల హక్కులను రక్షించ గలుగుతామని చెప్పారు. ప్రస్తుతం బాలలు లైంగిక హింస వేధింపులతో పాటు ఆన్లైన్ మోసాలకు ఎక్కువగా గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బాలలపై పనిచేసే అన్ని శాఖలు సంస్థలు ప్రజలు సమన్వయంతో పనిచేసి  జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా మార్చడానికి మన వంతు బాధ్యతగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీవో  విజయ కుమారి మాట్లాడుతూ బాలలు ఎంత ఆనందంగా  ఉన్నారన్న దాన్నిబట్టి ఆ దేశం ఎంత బాగుందో చెప్పవచ్చునని చెప్పారు. బాలల అభివృద్ధి దేశాభివృద్ధి అని కొనియాడారు. బాలలను ఆనందంగా ఎదిగేలా తల్లిదండ్రులు సమాజం బాధ్యత తీసుకోవాలని కోరారు. బాలలందరూ ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే సంపూర్ణమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.  పిల్లలను ఆనందంగా చదువుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి రషీద్, వికారాబాద్ తహసిల్దార్ వహీదా ఖాతూన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్ రామేశ్వర్ సిబ్బంది యాదయ్య రాములు దేవ కుమారి సంజమ్మ నరసింహులు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.