దాతల సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం : మంత్రి తలసాని

Published: Monday March 28, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : ఎల్లరికీ అమ్మ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదంతో, దాతల సహకారంతో ప్రభుత్వం  బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్దక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద దాతల సహకారంతో నూతనంగా 86 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 48 షాప్ లు, రేకుల షెడ్డు పనులను మంత్రి నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో కొలిచే శ్రీ బల్కంపేట ఎల్లమ్మ ఆమ్మవారి దర్శనం కోసం నగరం నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున వస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆలయం పక్కనే ఉన్న బోనాల కాంప్లెక్స్ వద్ద ఆలయం వద్ద ఉన్న వ్యాపారుల సౌకర్యార్థం 48 నూతన షాప్స్ తో పాటు రేకుల షెడ్డు దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారి కళ్యాణాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా  ఇప్పటికే ఆలయం ముందు భాగంలో దాతల సహకారంతో భారీ రేకుల షెడ్డును నిర్మించడం జరిగిందని తెలిపారు. శాశ్వత క్యూ లైన్ లను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు దాతలు విరాళాలను మంత్రికి అందజేశారు. విరాళాలు అందించేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చిన దాతలను మంత్రి అభినందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం 48 లక్షల రూపాయలను దాతలు విరాళాలు ప్రకటించారని, ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలను పలువురు దాతలు అందజేశారని కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ, పలువురు దాతలు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.