చెత్త బండ్లను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు ఇవ్వద్దు

Published: Monday April 04, 2022
సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు దుర్గం దినకర్
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలోని చెత్త సేకరణ బండ్లను థర్డ్ పార్ట్ కాంట్రాక్టర్లకు అప్పగించ వద్దని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దుర్గం దినకర్ మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ (స్వచ్ఛ) బండ్లను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా 9 మంది డ్రైవర్లను నియమించడానికి అధికారులు టెండర్లు వేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని అన్నారు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ నియమించడం వలన చెత్త సేకరణ చేస్తే ఒక్కొక్క ఇంటి నుండి రూ 30 చొప్పున నెలకు పంచాయతీకి దాదాపు రూ 30 వేలు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉందన్నారు. ప్రజల నుండి చెత్త సేకరణ డబ్బులు వసూలు చేయాలని కలెక్టర్ నిర్ణయాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తుందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకే చెత్త సేకరణ బండ్లను ఇవ్వాలని, థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని కోరారు. మల్టీపర్పస్ జీవో నెం 51ని పరిగణలోకి తీసుకొని కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, కల్పించాలని, ప్రతి గ్రామ పంచాయతీలోని కార్మికులకు ఇల్లు, ఇంటి స్థలం, ఇవ్వాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ ద్వారా చెత్త సేకరణ బండ్లు రద్దు చేసే వరకు కార్మికుల పక్షాన సిపిఎం పార్టీ ఐక్యంగా పోరాడుతుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్, గోడిసెల కార్తీక్ లు పాల్గొన్నారు.