వడ్డెర సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి

Published: Saturday February 04, 2023
* వడ్డెర సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు విఆర్ అంజిలయ్య
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రభుత్వాలు మారినా వడ్డెరల బతుకులు మారడం లేదని వడ్డెర సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు విఆర్ అంజిలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి పిలుపు మేరకు వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు వి ఆర్ అంజయ్య ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్న సందర్భంగా వికారాబాద్ పోలీసులు వడ్డెర సంఘం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్డెర కులస్తులను దృష్టిలో పెట్టుకొని మమ్ములను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వడ్డెర కులస్తులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, వడ్డెరులకు మైనింగ్ హక్కు కల్పించాలని, ప్రత్యేక హాస్టల్లో రిజర్వేషన్ కల్పించాలని, వివిధ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ కల్పించాలని స్పష్టం చేశారు. వడ్డెరులకు జీవిత బీమా సౌకర్యాన్ని పెంచాలని, వివిధ శాఖలలో టెండర్లు వచ్చే విధంగా చూడాలని, వడ్డెరులకు ప్రత్యేకంగా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకటయ్య, బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శిలు నర్సింలు, శ్రీనివాస్, డైరెక్టర్లు కిష్టయ్య, అంజయ్య, వెంకటయ్య తదితరులు ఉన్నారు.