జర్నలిస్టులకు ప్రభుత్వం మొండి చెయ్యి..!

Published: Tuesday February 22, 2022
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి..
సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టు లందరికీ సభ్యత్వాలు ఇవ్వాలి
తెలంగాణా జర్నలిస్ట్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బాపురెడ్డి 
సిద్దిపేట(ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సమాజ హితం కోసం రేయనక,పగలనక పనిచేస్తున్న పాత్రికేయులకు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తుందని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి బాపురెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పని చేసే ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం లేదంటే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ ఆ కుటుంబానికి నెలకు రూ. 5,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు పడ్డ బాధలు వర్ణనాతీతమని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే కష్టాలు దూరమవుతాయని సంబర పడ్డ జర్నలిస్టులకు నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.కరోనా కష్టకాలంలో మొక్కవోని ధైర్యంతో జర్నలిస్టులు తమ వంతు విధులు నిర్వహించారని కొనియాడారు. కరోనా మహమ్మారి వ్యాధి మూలంగా జర్నలిస్టులు ప్రాణాలు వదిలినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మంచి చెడులను, రాజకీయాలను ప్రజలు ముందుంచుతున్న జర్నలిస్టులపై వివక్ష తగదన్నారు. చిన్న పెద్ద జర్నలిస్ట్ అనే తారతమ్యం లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక దృష్టి సారించి జర్నలిస్టులకు స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి ధర్మంలో పార్టీలకు అతీతంగా జర్నలిస్టుల పని చేయాలే తప్ప ఏ ఒక్క పార్టీ మెప్పు పొందడానికి పని చేయవద్దని సూచించారు. కొన్నేళ్లుగా సభ్యత్వాలు ఇవ్వకుండా సహచర జర్నలిస్ట్ ల పట్ల వివక్ష చూపుతున్న... సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో అందరికీ సభ్యత్వం కల్పించాలన్నారు. జర్నలిస్టులలో సీనియర్లు, జూనియర్లు అనే భేదం మంచిది కాదన్నారు. జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారానికి కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఇకనైనా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి వెంటనే ఇళ్ల స్థలాల తోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బాపురెడ్డి డిమాండ్ చేశారు..