బెల్లంపల్లి అభివృద్ధిని మరవద్దు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య .

Published: Monday January 02, 2023
బెల్లంపల్లి జనవరి 1 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి ప్రాంతంలో బొగ్గు గనులు లేవనే నెపంతో అభివృద్ధిని మరువద్దని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఆదివారం స్థానిక స్టేషన్ రోడ్డు కాలనీలో 70 లక్షల రూపాయలతో చేపట్టే అంతర్గత సిసి, బీటీ, రోడ్ల నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు గుర్తింపు తెచ్చిందే బెల్లంపల్లి పట్టణమని, అలాంటి బెల్లంపల్లి పట్టణాన్ని ప్రస్తుతం బొగ్గు గనులు లేవని, ఉత్పత్తి లేదనే ఉద్దేశంతో అభివృద్ధి చేయకుండా వదిలిపెట్టడం సరైనది కాదని ఆయన అన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో ఉంటూ భూపాలపల్లి, గోదావరిఖని, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, ప్రాంతాలకు, అటు గోలేటి చివరి వరకు కార్మికులు ఇక్కడి నుండి వెళుతూ విధులు నిర్వర్తిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా బెల్లంపల్లి పట్టణంలోనే నివసిస్తున్నారని, వారికి విద్య, వైద్య, కనీస సౌకర్యాలైన కాలనీల్లో అంతర్గత రోడ్లు, నీళ్లు, గృహ సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు.
ఎంతో పేరున్న భూదా గెస్ట్ హౌస్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాడైపోతుందని, అలాగే అధికారులకు, కార్మికుల పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్న స్విమ్మింగ్ పూలు ,నిర్వీర్యంగా ఉందని వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
సింగరేణి ఆధీనంలో ఉన్న ఖాళీగా ఉన్న స్థలాల్లో, పందులు, జంతువులు, తిరుగుతూ సమీప ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఖాళీ ప్రదేశాలు లేకుండా వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు.
 వందలాది ఎకరాల భూమి ఖాళీగా ఉండడంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అధికారులు నివేదికలు తయారు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సింగరేణి క్వార్టర్లు, గెస్ట్ హౌస్ లు, ఫంక్షన్ హాల్స్, టిసిఓ క్లబ్బు, ఇల్లెందు క్లబ్బు,లు అన్ని ఒకే ఏరియా జీఎం పరిధిలో ఉండే విధంగా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిఎం, చింతల శ్రీనివాసు, మాట్లాడుతూ దశాబ్దాల క్రితం కాలనీల్లో  చేపట్టిన , రోడ్ల నిర్మాణం, మంచినీటి పైపుల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం పాడై పోయినందున, తిరిగి చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, విడతల వారీగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి కార్మికులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని, మొదట రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన అన్నారు.
సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఖాళీ స్థలాలు ఎంపిక చేసి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, భూదా గెస్ట్ హౌస్ ను, దానికి పోవడానికి రోడ్ల నిర్మాణానికి, ఇల్లందు క్లబ్బు, టి సి ఓ క్లబ్లను, ఆధునీకరించి కార్మికులకు, అధికారులకు, ఉపయోగపడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఒక విధంగా చెప్పాలంటే బెల్లంపల్లికి పూర్వ వైభవం తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్,  సిపిఐ, నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.