అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలి : తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షు

Published: Tuesday July 27, 2021
వికారాబాద్ బ్యూరో, జూలై 26, ప్రజాపాలన : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నారని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వల్ల పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ఈ పాఠ్యపుస్తకాలను వినియోగించుకుని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మోమిన్ పేట్ మండల పరిధిలోని చిన్నకోల్కుంద గ్రామం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఆన్ లైన్ వసతులు లేకుండా విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని అన్నారు. దీనిని నివారించేందుకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. టీ-సాట్, లోకల్ టీవీల ద్వారా ఆన్ లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ ఈచ్ వన్ టీచ్ వన్ అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములై నిరక్షరాస్యత నిర్మూలనకు తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రావణి, సుమిత్ర, ఎస్ఎంసీ ఛైర్మెన్ నర్సిములు, శ్రీను, విద్యార్థులు ఉన్నారు.