ఎర్రజెండా చేతపట్టి ప్రజా ఉద్యమాలను నిర్మించిన నాయకుడు మరీదు కృష్ణయ్య

Published: Wednesday June 08, 2022
కృష్ణయ్య మృతదేహానికి నివాళులర్పించిన సిపిఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు
 
 
బోనకల్ , జూన్ 7 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ మరీదు కృష్ణయ్య (90) గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతు సోమవారం అర్ధరాత్రి మరణించారు. మృతునికి భార్య ,ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తట్టుకొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా క్రమశిక్షణకు, నీతి నిజాయితీకి మారుపేరుగా మరీదు కృష్ణయ్య పనిచేశారని అన్నారు. సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన నాయకుడు అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కొనియాడారు. అదేవిధంగా గీత కార్మికుల సమస్యల పరిష్కారంలో మరీదు కృష్ణయ్య నిరంతరం పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించారన్నారు. రావినూతల గ్రామంలో భూస్వాములు, కాంగ్రెస్ నాయకులు కల్లుగీత కార్మికులకు చెందిన ముత్తాదులను తగలపెట్టిన సందర్భంలో వారి ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన నాయకుడు కృష్ణయ్య అని కొనియాడారు. రావినూతల గ్రామం లో సిపిఎం అభివృద్ధికి ఎనలేని కృషి మచ్చలేని నాయకుడుగా పనిచేశాడని, గ్రామంలో భూస్వాముల ఆగడాలను ఎదుర్కొనేందుకు మిలిటెంట్ పోరాటాలు చేయవలసి వస్తుందని పిలుపు ఇవ్వగానే కర్ర చేత పట్టుకొని ముందుకు వచ్చిన మహా ధైర్యవంతుడు కృష్ణయ్య అని కొనియాడారు. ఎవరు ఎటువంటి ప్రలోభాలకు ఎర చూపినా లొంగకుండా సిపిఎం పార్టీ లో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని అన్నారు. ప్రాణం పోయేంతవరకు సిపిఎం లోనే తన జీవితాన్ని గడిపారనీ. ఎర్రజెండా అంటే సహించని రోజులలో కూడా కృష్ణయ్య ఎర్రజెండా చేతపట్టి ప్రజా ఉద్యమాలను నిర్మించారని అన్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం నిరంతరం పని చేసిన నాయకుడు కృష్ణయ్య అని అన్నారు. సిపిఎం రావినూతల శాఖ కార్యదర్శిగా, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా 15 సంవత్సరాల పాటు పని చేశాడని అన్నారు. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కుంటూ ధైర్యంగా నిలబడిన వ్యక్తి మరీదు కృష్ణయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. కృష్ణయ్య మృతిపట్ల పోతినేని సంతాపాన్ని తెలిపి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణయ్య మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, సిపిఎం మధిర మండల కార్యదర్శి మంద సైదులు, మాజీ ఎంపీటీసీ లు గండు సైదులు, తాళ్లూరి బాబు, సిపిఎం శాఖా కార్యదర్శులు మందా వీరభద్రం, కొంగర భూషయ్య, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు చేడే వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎర్రగాని నాగరాజు, జోనిబోయిన గురవయ్య, కొమ్మినేని పిచ్చయ్య, దొండపాటి సత్యనారాయణ, ఏసుపోగు బాబు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు మరీదు పుల్లయ్య రావినూతల పిఎసిఎస్ సీఈఓ కొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.